Elepahant: హైదరాబాద్ జూలో అత్యధిక కాలం జీవించిన ఆడ ఏనుగు కన్నుమూత!

  • 83 ఏళ్లు జీవించిన ‘గజరాణి’
  • వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో కన్నుమూత
  • మగ చిరుత ‘అయ్యప్ప’ కూడా మృతి
  • జీవిత కాలం కంటే ఆరేళ్లు ఎక్కువ జీవించిన ‘అయ్యప్ప’
Elephant Gajarani Died with Age related issues in Hyderabad zoo

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో అత్యధిక కాలం జీవించిన ఏనుగుగా రికార్డులకెక్కిన ఆడ ఏనుగు ‘గజరాణి’ నిన్న మృతి చెందింది. 83 ఏళ్ల ఈ ఏనుగు వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్యంతో బాధపడుతోంది. ఏసియాటిక్ జాతికి చెందిన ఈ ఏనుగు నిజాం కాలం నాటిది.

నగరంలో జరిగే సంప్రదాయ కార్యక్రమాలు, ఉత్సవాలు, మొహర్రం, బోనాల ఊరేంగిపులో కొన్నేళ్లపాటు ‘గజరాణి’ పాల్గొంది. సాధారణంగా ఏనుగుల జీవిత కాలం 60 ఏళ్లేనని, కానీ ఇది 83 ఏళ్లు జీవించిందని జూ అధికారులు తెలిపారు. 7 జులై 1938లో జన్మించిన ఈ ఏనుగును గతేడాది జులైలో టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ దత్తత తీసుకున్నారు.

కాగా, వృద్ధాప్య సమస్యలతోనే నిన్న ఇదే జూలో ఓ మగ చిరుత కూడా మృతి చెందింది. దీని వయసు 21 సంవత్సరాలు. 16 జూన్ 2000వ సంవత్సరంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో జన్మించిన ఈ చిరుత పేరు ‘అయ్యప్ప’. చిరుత సంతతి రక్త మార్పిడిలో భాగంగా దీనిని హైదరాబాద్‌కు తరలించారు. చిరుతల జీవిత కాలం 15 ఏళ్లు మాత్రమేనని, అయితే జూలో వాటి సంరక్షణపై తీసుకునే శ్రద్ధ, ఆహారం కారణంగా ‘అయ్యప్ప’ మరో ఆరేళ్లు అధికంగా జీవించిందని అధికారులు తెలిపారు.

More Telugu News