పశ్చిమ బెంగాల్ బీజేపీలో గుబులు.. ముఖ్యమైన సమావేశానికి ముఖ్య నేతల గైర్హాజరీపై చర్చ!

09-06-2021 Wed 21:04
  • నిన్న బీజేపీ ముఖ్య నేతల సమావేశం
  • సువేందు, ముకుల్ రాయ్, రాజీవ్ బెనర్జీ డుమ్మా
  • సువేందు ఎందుకు రాలేదో తనకు తెలియదన్న బీజేపీ చీఫ్
BJP Stalwarts Mukul Roy Rajib Banerjee Missing From Crucial Party Meet

పశ్చిమ బెంగాల్ బీజేపీలో ఇప్పుడు మరో గుబులు మొదలైంది. టీఎంసీని వీడి బీజేపీలోకి వచ్చిన పలువురు నేతలు తిరిగి అధికారపార్టీ వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన బీజేపీ ముఖ్య నేతల సమావేశానికి పలువురు ప్రముఖులు డుమ్మా కొట్టడం కాషాయ పార్టీలో కలకలం రేపుతోంది. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన సువేందు అధికారితోపాటు ఆ పార్టీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ముకుల్ రాయ్, మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ తదితరులు డుమ్మా కొట్టారు.

ప్రధాని మోదీ సహా ముఖ్య నేతలతో సమావేశం కోసం సువేందు అధికారి ఢిల్లీ వెళ్లడంతో సమావేశానికి రాలేకపోయారని చెబుతుండగా, ముకుల్ రాయ్, రాజీవ్ బెనర్జీలు ఎందుకు రాలేదన్నది చర్చనీయాంశమైంది. అలాగే, ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారి ముఖ్యమైన సమావేశాన్ని వదిలిపెట్టి ఢిల్లీ ఎందుకు వెళ్లారన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక్కడ సమావేశం ఉన్న విషయం తెలిసీ ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లారన్న విషయం తనకు తెలియదని ఆ పార్టీ వెస్ట్ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు.