జైలులో ప్రత్యేక డైట్‌ కోరిన రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌.. కుదరదన్న కోర్టు!

09-06-2021 Wed 20:33
  • హత్య కేసులో అరెస్టయిన సుశీల్‌ కుమార్‌
  • పోటీలకు సన్నద్ధమవుతున్నానని వెల్లడి 
  • చట్టం ముందు అందరూ సమానులేనని వ్యాఖ్య
Wrestler Sushil kumar Demanded special diet

తోటి రెజ్లర్‌ హత్య కేసులో అరెస్టయి, ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండులో ఉన్న ప్రముఖ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ జైలులో తనకు ప్రత్యేక డైట్‌ ఇవ్వాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. తాను రెజ్లింగ్‌ పోటీలకు సన్నద్ధమవుతున్నానని.. ఒమెగా 3 క్యాప్సూల్స్‌, ప్రీవర్కవుట్‌ సప్లిమెంట్లు, మల్టీ విటమిన్ మాత్రలు సహా పౌష్టికాహారం ఇవ్వాలని పిటిషన్‌లో కోరాడు.

దీనిపై నేడు విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు అందుకు నిరాకరించింది. జైలు నిబంధనల ప్రకారం.. సుశీల్‌కు అందరికీ అందే బ్యాలెన్స్‌ డైట్‌ అందుతున్నట్లు తెలుస్తోందని తెలిపింది. అలాగే అధికారులు ఇస్తున్న ఆహారంలో లోపం ఉన్నట్లు కూడా ఎక్కడా సుశీల్‌ పేర్కొనలేదని స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలో జైలులో ఇస్తున్న ఆహారం సరైందేనని అభిప్రాయపడింది. అయితే, సుశీల్‌ ఆహారం విషయంలో ప్రత్యేక సౌకర్యాలను కోరుకుంటున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది.

తోటి ఖైదీలతో పోలిస్తే సుశీల్‌కు ప్రత్యేక డైట్‌ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానులేనని వ్యాఖ్యానించింది. నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేసింది.