సమంత క్షమాపణలు చెప్పాల్సిందే: తమిళ సీనియర్ నటుడు మనోబాల

09-06-2021 Wed 17:32
  • ‘ది ఫ్యామిలీ మేన్-2’ వెబ్ సిరీస్‌లో నటించిన సమంత
  • తమిళుల మనోభావాలను కించపరిచేలా ఆ పాత్ర ఉందన్న మనోబాల
  • నటించడానికి ముందు సమంత ఆలోచించి ఉండాల్సిందన్న నటుడు
  • సమంత క్షమాపణ చెప్పినా సిరీస్‌కు వ్యతిరేకంగా పోరాటం ఆపబోమని హెచ్చరిక
Samantha Akkineni to be sought Apology says manobala

తమిళ ప్రజల మనోభావాలను కించపరిచిన టాలీవుడ్ నటి సమంత తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోలీవుడ్ సీనియర్ నటుడు మనోబాల డిమాండ్ చేశారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఫ్యామిలీ మేన్-2’ వెబ్ సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్ తమిళ ప్రేక్షకుల మనోభావాలను కించపరిచేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన మనోబాల.. సమంత నటించిన ఆ వెబ్‌సిరీస్ తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు.

ఇలాంటి వెబ్ సిరీస్‌లో నటించిన సమంత తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందేనని అన్నారు. ఆమె పాత్రను ఓ పోరాటయోధురాలిగా సినిమాలో అభివర్ణించినప్పటికీ ఈలం పోరాట క్షీణతను తెలియజేసేలా చిత్రీకరించారని అన్నారు. ఇలాంటి కథను ఒప్పుకోవడానికి ముందు సమంత ఆలోచించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో సమంత క్షమాపణలు చెప్పినా ఊరుకునేది లేదని, చిత్రబృందం పూర్తి బాధ్యత తీసుకునే వరకు ఈ సిరీస్‌కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని మనోబాల స్పష్టం చేశారు.