కాజల్ కి బాలీవుడ్ లో మరో ఛాన్స్!

09-06-2021 Wed 17:14
  • పెళ్లయినా సినిమాలతో కాజల్ బిజీ 
  • చిరంజీవి, నాగార్జునలతో సినిమాలు
  • 'ఖైదీ' హిందీ రీమేక్ లో అవకాశం
  • అజయ్ దేవగణ్ తో రెండో సినిమా  
Kajal to be cast opposite Ajay Devagan again

పెళ్లయినప్పటికీ కొత్త సినిమాల విషయంలో కథానాయిక కాజల్ అగర్వాల్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఇక సినిమాలు వదిలేసి, సంసార జీవితంలో అమ్మడు బిజీ అయిపోతుందనుకుంటున్న వారికి ఝలక్ ఇస్తూ కొత్త సినిమాలను అంగీకరిస్తోంది. ఇప్పటికే తమిళంలో కమలహాసన్ తో 'ఇండియన్ 2', తెలుగులో చిరంజీవితో 'ఆచార్య', నాగార్జునతో మరో సినిమా చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హిందీలో అజయ్ దేవగణ్ సరసన ఓ సినిమాలో నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది.

కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఇటీవల తమిళంలో వచ్చిన 'ఖైదీ' సినిమా మంచి హిట్టయింది. దీనిని తెలుగులో అనువదించగా ఇక్కడ కూడా సక్సెస్ అయింది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్ర కోసం ప్రస్తుతం కాజల్ తో సంప్రదింపులు జరుగుతున్నట్టు చెబుతున్నారు.

వాస్తవానికి తమిళ ఒరిజినల్ లో కథానాయిక పాత్ర లేదు. అయితే, హిందీ వెర్షన్లో గ్లామర్ కోసం ఆ పాత్రను ప్రత్యేకంగా సృష్టించారట. ఇక ఇది అజయ్ దేవగణ్ తో కాజల్ కి రెండో చిత్రమవుతుంది. గతంలో వీరిద్దరూ కలసి 'సింగం' సినిమాలో జంటగా నటించారు.