COVID19: 'సీరమ్'​ సంస్థలో సమస్యల వల్లే ప్రపంచంలో టీకాల కొరత!

  • ఒకే సంస్థపై ఆధారపడడమూ కారణమంటున్న నిపుణులు
  • కొరతకు ఆజ్యం పోసిన అగ్ని ప్రమాదం
  • రెండు మూడు వారాల పాటు ఆగిన ఉత్పత్తి
  • దేశంలో పెరిగిన డిమాండ్ తో ఎగుమతులు బంద్
Problems At Biggest Vaccine Maker Serum Cause Global Shortages

వ్యాక్సిన్ల కొరత ఒక్క భారత్ లోనే కాదు.. చాలా దేశాల్లోనూ ఉంది. పేద దేశాలకు వ్యాక్సిన్లను అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కొవ్యాక్స్ గ్రూప్ కూ తప్పలేదు. కారణం ఒకే ఒక్క సంస్థ.. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అవును, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తి దారైన సీరమ్ ఇనిస్టిట్యూట్.. కేంద్ర ప్రభుత్వంతో పాటు చాలా దేశాలతోనూ ఒప్పందం చేసుకుంది.

అయితే, మన దేశంలో పెరిగిపోతున్న డిమాండ్, మన డిమాండ్ కు తగిన ఉత్పత్తి లేకపోవడం వంటి కారణాల వల్ల ఎగుమతులను ఆపేసింది. దీంతో 92 దేశాలకు 20 కోట్ల డోసులను సరఫరా చేయాలనుకున్న కొవ్యాక్స్ కు ఇప్పటిదాకా కేవలం 3 కోట్ల డోసులే అందాయి. మొత్తంగా కొవ్యాక్స్ సహా చాలా దేశాలు సీరమ్ మీద అతిగా ఆధారపడడం వల్లే ఇంతటి కొరత ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి 2020 చివరి నాటికే 40 కోట్ల డోసులను అందిస్తామని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించారు. అయితే, ఈ ఏడాది మొదలయ్యే నాటికి కేవలం 7 కోట్ల డోసులను మాత్రమే తయారు చేశామని ఆయన ఇటీవల ప్రకటించారు. దానికి కారణం టీకా స్టోరేజీ (గోదాములు) సామర్థ్యం తక్కువగా ఉండడం, ఎగుమతులపై ప్రభుత్వ ఆంక్షలు వంటి కారణాల వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని చెప్పారు.  

దెబ్బ కొట్టిన అగ్ని ప్రమాదం

వివిధ దేశాలు, కొవ్యాక్స్ గ్రూప్ సీరమ్ కే ఎక్కువగా ఆర్డర్లు పెట్టడానికి వెనుక కారణాలు లేకపోలేదు. ప్రపంచంలోనే టీకాల అతిపెద్ద ఉత్పత్తిదారు కావడం, ఉత్పత్తి సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉండడంతో సీరమ్ కొవిషీల్డ్ టీకాలకు ఆర్డర్ పెట్టాయి. అయితే, ఈ ఏడాది జనవరిలో సంస్థ ఉత్పత్తి యూనిట్ లో అగ్ని ప్రమాదం సంభవించడం పెద్ద నష్టాన్ని చేసింది. పరికరాలు కాలిపోయాయి. దాదాపు రెండు మూడు వారాల పాటు ఉత్పత్తి ఆగిపోయింది. సుమారు రూ.వెయ్యి కోట్లకుపైనే నష్టం జరిగినట్టు పూనావాలా చెప్పారు.

దీంతో అనుకున్న లక్ష్యం అందుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీరమ్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుందని, దాని వల్ల భారత్ కు లాభమని డబ్ల్యూహెచ్ వో వ్యాక్సిన్ కూటమి 'గావి' సీఈవో సేఠ్ బర్కిలీ అన్నారు. అయితే, కొవ్యాక్స్, పేద దేశాలకు మాత్రం మరికొన్నాళ్లు వ్యాక్సిన్లకు కటకట తప్పదంటున్నారు. ఈ ఏడాది చివరికైనా ఎగుమతులు ప్రారంభమయ్యే అవకాశం లేదని చెప్పారు. దీంతో ఇటీవల ఆమోదం పొందిన చైనా వ్యాక్సిన్లు సినోవ్యాక్, సినోఫార్మ్ టీకాలమీద ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు.

అయితే, మారుతున్న పరిణామాలూ, దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా టీకాలపై ప్రభావం చూపింది. వాస్తవానికి మొదట్లో కోటీ పది లక్షల డోసులకే సీరమ్ తో ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత సెకండ్ వేవ్ ఉద్ధృతి నేపథ్యంలో టీకాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులను కేంద్రం ఆపేసింది. సీరమ్ కు ఎక్కువ సంఖ్యలో ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. దీంతో సంస్థపై భారం పడింది. ఇన్ని కారణాల వల్ల అనుకున్న టార్గెట్ ను సంస్థ అందుకోలేకపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

More Telugu News