ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతాం!: నారా లోకేశ్

09-06-2021 Wed 10:09
  • పరీక్షలు రాయాలో, ప్రాణాలు కాపాడుకోవాలో విద్యార్థులకు తెలియడం లేదు
  • 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు కరోనా బారినపడ్డారు
  • వాట్సాప్ నంబరుకు 5 లక్షల మంది సంఘీభావం
Nara Lokesh doubts about Jagan mental Condition

ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మానసిక ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు పరీక్షలు రాయాలో, లేక ప్రాణాలు కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నారని అన్నారు.

రాష్ట్రంలో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు కరోనా బారినపడినట్టు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతామని అన్నారు.

పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండుతో తాము ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబరుకు గత రెండు నెలల్లో 5,00,823 మంది సంఘీభావం తెలిపినట్టు లోకేశ్ పేర్కొన్నారు. అలాగే, 2,47,868 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ నంబరు ఫోనులో తమ అభిప్రాయాలను పంచుకున్నట్టు వివరించారు.