కాన్పూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం

09-06-2021 Wed 07:20
  • జేసీబీని ఢీకొని వంతెన పైనుంచి కిందపడిన బస్సు
  • ఘటనా స్థలంలోనే పలువురి మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ, యోగి
  • బాధిత కుటుంబాలకు పరిహారం
17 killed as bus collides with loader near Kanpur

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు సచెంది వద్ద జేసీబీని ఢీకొని బ్రిడ్జి పైనుంచి కిందపడింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలంలోనే పలువురు మరణించారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. యూపీ రోడ్ వేస్‌కు చెందిన శతాబ్ది ఏసీ బస్సు లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ప్రమాదం విషయం తెలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు, ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.