భారత్ బయోటెక్‌కు 64 మంది కమెండోలతో సీఐఎస్ఎఫ్ భద్రత

09-06-2021 Wed 07:01
  • కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్
  • హైదాబాద్‌ శివారులోని ప్లాంటుకు సీఐఎస్ఎఫ్ కమెండోలతో పహారా
  • ఆదేశాలు జారీ చేసిన కేంద్రం
CISF to take over security of Bharat Biotechs Hyderabad facility from June 14

కరోనా టీకా కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్‌కు భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్‌ శివారు శామీర్ పేట జినోమ్‌వ్యాలీలో ఉన్న కంపెనీ ప్రాంగణానికి 64 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమెండోలతో రక్షణ కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి కమెండోలు పరిశ్రమకు రక్షణగా ఉంటూ పహారా కాస్తారని సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అనిల్ పాండే తెలిపారు.

కొవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థపై ఉగ్రవాదుల కన్ను పడే అవకాశం ఉండడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రభుత్వం ప్రముఖ ప్రైవేటు సంస్థలకు ఇలాంటి భద్రత కల్పిస్తూ వస్తోంది. పూణె, మైసూరులోని ఇన్ఫోసిస్, నవీ ముంబైలోని రిలయన్స్ ఐటీ పార్క్, హరిద్వార్‌లోని రాందేవ్ బాబా పతంజలి సహా దేశవ్యాప్తంగా పది చోట్ల ఇలాంటి భద్రత కల్పించింది. తాజాగా భారత్ బయోటెక్‌కు సీఐఎస్ఎఫ్ కమెండోలతో భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.