ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల గరిష్ఠ ధరను నిర్ణయించిన కేంద్రం

08-06-2021 Tue 21:53
  • కొవిషీల్డ్‌ ఒక్కో డోసు రూ.780
  • కొవాగ్జిన్‌ ఒక్కో డోసు రూ.1,410
  • స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు రూ.1,145
  • సర్వీసు ఛార్జి, పన్నులు కలుపుకొనే ఈ ధరలు
  • గరిష్ఠ సర్వీసు ఛార్జి రూ.150
Centre Fixes Maximum Price For corona vaccines in Private Hospitals

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాలకు కేంద్రం కొత్త ధరలను నిర్ణయించింది. కొవిషీల్డ్‌ ధరను గరిష్ఠంగా డోసుకు రూ.780, కొవాగ్జిన్‌ డోసుకు రూ.1,410గా నిర్ణయించింది. ఇక రష్యన్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి టీకాకు ఒక్కో డోసుకు గరిష్ఠంగా రూ.1,145 వసూలు చేసేందుకు అనుమతించింది. రూ.150 సర్వీసు ఛార్జీతో పాటు పన్నులు కూడా కలుపుకొని ఈ ధరను నిర్ణయించినట్లు వెల్లడించింది.  కరోనా వ్యాక్సిన్ల పేరిట ప్రైవేటు ఆసుపత్రుల లాభాలను ఆర్జిస్తున్నాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. టీకాల గరిష్ఠ ధరలను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.150 కంటే ఎక్కువ సర్వీసు ఛార్జీలను వసూలు చేయొద్దని.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించాలని కేంద్రం ఆదేశించింది. వ్యాక్సిన్ల ధరల విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను ఉచితంగానే అందించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.