పవన్ కల్యాణ్ 28వ చిత్రంపై మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన

08-06-2021 Tue 21:08
  • హరీశ్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కొత్త చిత్రం
  • పవన్ 28వ చిత్రం స్టిల్స్ అంటూ ఫొటోలు ప్రచారం
  • టైటిల్ పైనా సోషల్ మీడియా పోస్టులు
  • వివరణ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్
  • తాము చెబితేనే అఫిషియల్ అవుతుందని వెల్లడి
Mytri Movie Makers update about Pawan Kalyan new movie

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ వీళ్లిద్దరూ జత కలుస్తుండడంతో ఈసారి ఇంకెంత పెద్ద హిట్ వస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో తాజాగా రాబోయే చిత్రం పవన్ కెరీర్ లో 28వది. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తోంది. అయితే, ఈ సినిమాలో పవన్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పైగా, టైటిల్ విషయంలోనూ కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారం బాగా ముదరడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది.

వాస్తవానికి పవన్ 28వ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ఉగాది రోజున విడుదల చేయాలని నిర్ణయించామని, కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ నిర్ణయం వాయిదా పడిందని వెల్లడించింది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కొత్త చిత్రానికి సంబంధించి కొన్ని అంశాలు వినిపిస్తున్నాయని, వాటిలో నిజం లేదని మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. పవన్ 28వ చిత్రానికి సంబంధించి ఏ విషయం అయినా తమ అధికారిక ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని పేర్కొంది. అభిమానులు ఈ విషయం గమనించాలని సూచించింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫొటో ఇదే... (ఫ్యాన్ మేడ్)