CJI: సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన 5వ తరగతి చిన్నారి.. స్పందించిన జస్టిస్‌ రమణ

CJI Recievd a letter of praise from 5th class student
  • కేరళ త్రిశూర్‌కు చెందిన లద్వినా జోసెఫ్‌
  • మహమ్మారిపై సుప్రీంకోర్టు సకాలంలో స్పందించిందని కితాబు
  • కోర్టు చర్యల వల్ల అనేక ప్రాణాలు నిలబడ్డాయని ప్రశంస
  • లేఖతో పాటు అందమైన చిత్రం 
  • ప్రశంసిస్తూ లేఖ రాసిన ప్రధాన న్యాయమూర్తి
  • బహుమానంగా రాజ్యాంగ ప్రతి
కేరళకు చెందిన ఓ చిన్నారి ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో సుప్రీంకోర్టు సకాలంలో స్పందించి ప్రభుత్వాలకు తగు సూచనలు చేసిందని అభినందించింది. అందుకు ఆ చిన్నారి కోర్టుకు కృతజ్ఞతలు తెలిపింది.

తాను రోజూ ‘ది హిందూ’ దినపత్రిక చదువుతానని తెలిపింది. దీంతో కోర్టు ఎప్పటికప్పుడు స్పందిస్తున్న తీరును గమనించే అవకాశం కలిగిందని పేర్కొంది. కోర్టు చర్యల వల్ల అనేక మందికి సకాలంలో ఆక్సిజన్‌ సహా ఇతర వైద్య సాయం అంది ప్రాణాలు నిలిచాయని కొనియాడింది.  

త్రిశూర్‌లోని కేంద్రీయ విద్యాలయలో 5వ తరగతి చదువుతున్న లిద్వినా జోసెఫ్‌ ఆ లేఖతో ఆగలేదు. సుప్రీంకోర్టులో చీఫ్‌ జస్టిస్‌ ఆసీనులయ్యే బెంచ్‌, అక్కడ ఉండే వస్తువులను స్వయంగా తన చేతులతో బొమ్మ గీసి లేఖకు జత చేసింది. అందులో చీఫ్‌ జస్టిస్‌ తన చేతిలో ఉండే సుత్తితో కరోనాను బాదుతున్నట్లు ఉండడం విశేషంగా ఆకట్టుకుంటోంది. లేఖను సైతం అందమైన స్వదస్తూరితో రాయడం విశేషం.
దీనికి చీఫ్‌ జస్టిజ్‌ ఎన్వీ రమణ మంత్రముగ్ధులయ్యారు. లిద్వినా జోసెఫ్‌ లేఖకు స్పందిస్తూ ఆ చిన్నారికి ఉత్తరం రాశారు. తాను గీసిన అందమైన బొమ్మతో పాటు లేఖ అందినట్లు తెలిపారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నందుకు అభినందిస్తున్నానన్నారు. మహమ్మారి సమయంలో ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నందుకు చిన్నారిని ప్రశంసించారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఓ బాధ్యత గల పౌరురాలిగా ఎదుగుతావని ఆకాంక్షించారు. అలాగే ఆయన సంతకం చేసిన ఓ రాజ్యాంగ ప్రతిని ఆమెకు బహుమానంగా పంపారు.
CJI
Supreme Court
Corona Virus
Justice Ramana

More Telugu News