అందుకే మిగిలినవాళ్లను గులాబీ పార్టీలోకి సాగనంపుతున్నాడు: విజయసాయిరెడ్డి

08-06-2021 Tue 17:34
  • తాజా పరిణామాలపై విజయసాయి స్పందన
  • తెలంగాణలో భవిష్యత్తు లేదని బాబుకు అర్థమైందని వెల్లడి
  • పలు పార్టీలలోకి నేతలను పంపుతున్నాడని వ్యాఖ్యలు
  • అరెస్ట్ భయం నుంచి రక్షణ కోసమేనని ఆరోపణ
Vijayasai Reddy opines on latest political developments

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు లేదని బాబుకు ఎప్పుడో అర్థమైందని తెలిపారు. అందుకే ఒక బ్యాచ్ ను కాంగ్రెస్ లోకి, మిగిలిన వాళ్లను గులాబీ పార్టీలోకి వెళ్లాలని ఆదేశించాడని వివరించారు. ఇప్పటికే నలుగురు ఎంపీలకు బీజేపీ తీర్థం ఇప్పించాడని, అరెస్ట్ భయంతో స్వీయరక్షణ కోసమే ఈ సాగనంపటాలు అని విమర్శించారు.

ప్రజలు ఈడ్చి కొట్టారు కాబట్టి సరిపోయిందని, బాబు ఇంకో పదేళ్లు అధికారంలో ఉండుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరయ్యేదని వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఏనాడూ జనరంజక పాలకుడు కాలేకపోయాడని విమర్శించారు. ఎల్లో మీడియా మద్దతుతో కొనసాగాడని, ప్రజలంటే ఎప్పుడూ చిన్నచూపేనని తెలిపారు.

ఉచితంగా కరోనా ఔషధాలు ఇచ్చే ఆనందయ్య మీద కూడా చంద్రబాబు పగబట్టాడని విజయసాయి పేర్కొన్నారు. తన బుట్టలో పడలేదని, సొంతంగా మందు పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్న అక్కసుతో వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నాడని ఆరోపించారు.