Corona Virus: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

  • గత 24 గంటల్లో 7,796 కేసులు, 77 మరణాలు 
  • చిత్తూరు జిల్లాలో 12 మరణాల నమోదు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది మృతి
  • 11,629కి చేరిన మొత్తం మృతుల సంఖ్య
Corona deaths declines in AP

ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇటీవలి వరకు నిత్యం 100కి పైగా నమోదైన మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అయితే, గత కొన్నిరోజులుగా కరోనా మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 77 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది మరణించారు. ఇప్పటిదాకా ఏపీలో కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 11,629కి చేరింది.

అటు, కరోనా పాజిటివ్ కేసుల విషయంలోనూ ఊరట లభిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 89,732 కరోనా పరీక్షలు నిర్వహించగా... 7,796 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 1,302 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,210 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 147 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 14,641 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 17,71,007 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 16,51,790 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,07,588 మందికి చికిత్స కొనసాగుతోంది.

More Telugu News