ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం రద్దుపై సుప్రీంకోర్టుకు వెళతా: నవనీత్ కౌర్

08-06-2021 Tue 15:47
  • ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కాదన్న హైకోర్టు
  • తీర్పును గౌరవిస్తానన్న నవనీత్ కౌర్
  • త్వరలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్టు వెల్లడి
  • న్యాయం జరుగుతుందన్న నమ్మకముందని ధీమా
MP Navneet Kaur Rana says she will approach Supreme Court

సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ, ఆమె గతంలో దాఖలు చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు (నాగ్ పూర్ బెంచ్) రద్దు చేయడం తెలిసిందే. బాంబే హైకోర్టు తీర్పుపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ స్పందించారు. ఓ భారత పౌరురాలిగా కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని వెల్లడించారు. అయితే, ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు.

కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కమిటీని తప్పుదారి పట్టించేందుకు నవనీత్ కౌర్ కల్పిత, మోసపూరిత పత్రాలను సమర్పించారని నాగ్ పూర్ బెంచ్ అభిప్రాయపడింది. మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను ప్రేమ వివాహం చేసుకున్న నవనీత్ కౌర్ అమరావతి ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఆమె ఎస్సీ కాదంటూ శివసేన నేతలు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.