పరిస్థితులు చక్కబడ్డాకే ఇంటర్, పది పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేశ్

08-06-2021 Tue 15:11
  • ఏపీలో వాయిదా పడిన ఇంటర్, పది పరీక్షలు
  • కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
  • పరీక్షలు నిర్వహించి తీరుతామని ఆదిమూలపు పునరుద్ఘాటన
  • పరీక్షల అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శలు
Education Minister Adimulapu Suresh clarifies in Inter and Tenth class exams

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాతే ఇంటర్, పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్, పది పరీక్షలను కూడా విపక్షం రాజకీయాలకు వాడుకుంటోందని విమర్శించారు. ఇతర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే మనమూ చేయాలా? అని ఆదిమూలపు ప్రశ్నించారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా? అని నిలదీశారు.

కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలపై జులైలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి జూన్ 7 నుంచి పది పరీక్షలు జరగాల్సి ఉండగా, ఆ సమయంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తుండడంతో వాయిదా వేశారు. ఇక ఇంటర్ పరీక్షలను ఆగస్టులో నిర్వహించే అవకాశాలున్నాయి. పరీక్షల తేదీకి 15 రోజుల ముందు ప్రకటన చేస్తామని మంత్రి ఆదిమూలపు ఇప్పటికే తెలిపారు.