Navneet Kaur: ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కాదు... బాంబే హైకోర్టు సంచలన తీర్పు

  • స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచిన సినీ నటి
  • మహారాష్ట్రలోని అమరావతి స్థానం నుంచి ఎన్నిక 
  • ఎస్సీనంటూ తప్పుడు పత్రాలు ఇచ్చారంటున్న శివసేన
  • ప్రమాదంలో పడిన నవనీత్ కౌర్ ఎంపీ పదవి
Bombay High Court cancels MP Navneet Kaur caste certificate

సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు నవనీత్ కౌర్ (35)కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అలాగే, రూ.2 లక్షల జరిమానా కూడా వడ్డించింది.

నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే, నవనీత్ కౌర్ తాను ఎస్సీ అని పేర్కొంటూ తప్పుడు పత్రాలు సమర్పించారని శివసేన నేత ఆనంద్ రావ్ అడ్సల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఆమె ఎస్సీ కాదని తేల్చింది. కుల ధ్రువీకరణ రద్దు నేపథ్యంలో నవనీత్ కౌర్ తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.

కాగా, గత మార్చిలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్ సభ లాబీలో బెదిరించారని నవనీత్ కౌర్ ఆరోపించడం తెలిసిందే. మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారని ఆమె నాడు వెల్లడించారు. అంతేకాదు, శివసేన లెటర్ హెడ్ తో బెదిరింపు లేఖలు వస్తున్నాయని, హెచ్చరికలు చేస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు.

More Telugu News