బ్లాక్​ ఫంగస్​ చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు చేసిన ‘తొలి పేషెంట్​’!

08-06-2021 Tue 14:01
  • కేసుల తొలినాళ్లు కావడంతో చికిత్స పద్ధతులూ కొత్తే
  • హైదరాబాద్ సహా వివిధ ఆసుపత్రుల చుట్టూ చక్కర్లు
  • చివరకు నాగ్ పూర్ లోని ఆసుపత్రిలో చికిత్స
  • కన్నును తొలగించిన వైద్యులు
Black Fungus First Patient Spent Above 1 Crore For Treatment

కరోనా చికిత్సకే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చికిత్సకూ అంతకన్నా ఎక్కువే పెట్టాల్సి వస్తోంది. ఇందుకు నిదర్శనం బ్లాక్ ఫంగస్ బారిన పడిన మహారాష్ట్రలోని విదర్భకు చెందిన నవీన్ పాల్ (46) అనే వ్యక్తి రూ.కోటిన్నర ఖర్చు పెట్టడమే.

గత అక్టోబర్ లోనే తనలోని బ్లాక్ ఫంగస్ లక్షణాలను వైద్యులకు నవీన్ చెప్పారు. కానీ, అప్పటికి అదే తొలి కేసు కావడం, దాని చికిత్సా పద్ధతులు తెలియకపోవడంతో అతడు తన ఎడమ కంటిని కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు ఆరు ఆసుపత్రుల్లో 13 శస్త్రచికిత్సల తర్వాత అతడు కోలుకున్నాడు.

అతడి భార్య రైల్వే ఉద్యోగి కావడంతో చికిత్సకు అయిన ఖర్చుల్లో కోటి రూపాయలను రైల్వే శాఖ భరించింది. మిగతా రూ.48 లక్షలను అతడు సమీకరించుకున్నాడు. తన ప్రాణం దక్కుతుందంటే కన్ను పోయినా ఫర్వాలేదని డాక్టర్లకు చెప్పినట్టు నవీన్ తెలిపాడు.

సెప్టెంబర్ లో తనకు కరోనా సోకిందని, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నానని, కొన్ని రోజులకు తగ్గిపోవడంతో ఇంటికొచ్చేశానని తెలిపాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే పన్ను, కన్ను బాగా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పాడు. నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరానని, అక్కడి నుంచి హైదరాబాద్ కూ వెళ్లానని వివరించాడు. అక్కడి నుంచి నాగ్ పూర్ కు పంపించారన్నారు.

నాగ్ పూర్ నుంచి ముంబైలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని చెప్పాడు. అక్కడ కొన్ని రోజులకే రూ.20 లక్షల బిల్లు వేయడం.. చేతిలోని డబ్బు అయిపోవస్తుండడంతో మళ్లీ నాగ్ పూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరానన్నాడు. అక్కడే తన కంటిని తీసేశారని, కన్ను పోయినా ప్రాణం దక్కినందుకు సంతోషంగానే ఉందన్నాడు.