నా రాజీనామా త‌ర్వాత హుజూరాబాద్‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక కురుక్షేత్రం యుద్ధం వంటిది!: ఈట‌ల

08-06-2021 Tue 13:23
  • నా రాజీనామా త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌లో కేసీఆర్‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెబుతారు
  • గొర్ల మంద‌ల మీద తొడేళ్లు ప‌డ్డ‌ట్లుగా నా మ‌ద్ద‌తు దారుల‌పై దాడులు
  • సంపూర్ణ మ‌ద్ద‌తు నాకే ఇస్తామ‌ని ప్ర‌జ‌లు చెప్పారు
  • త్వ‌ర‌లో జ‌రిగే సంగ్రామం కౌర‌వుల‌కు, పాండ‌వుల‌కు మ‌ధ్య జ‌రిగిన యుద్ధంలాంటిది
etela slams trs

టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత త‌న సొంత హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గంలో తొలిసారి ప‌ర్య‌టిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్.. శంభునిప‌ల్లి నుంచి క‌మ‌లాపూర్ వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు.  

'నా నియోజ‌క‌ వ‌ర్గ ప్ర‌జ‌లు నాతో చెప్పారు.. నాకు అన్యాయం జ‌రిగింద‌ని అన్నారు. 19 ఏళ్ల పాటు గులాబీ జెండాను, తెలంగాణ ఉద్య‌మాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటే తెలంగాణ ద్రోహుల‌ను ప‌క్క‌కు పెట్టుకుని, క‌ష్ట‌కాలంలో అండ‌గా ఉన్న నాలాంటి వారికి కేసీఆర్‌ ద్రోహం చేస్తున్నార‌ని చెప్పారు. రాబోయే కాలంలో నా రాజీనామా అనంత‌రం వ‌చ్చే ఉప‌ ఎన్నిక‌లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పి తీరుతామ‌న్నారు' అని ఈట‌ల అన్నారు.

'అక్ర‌మంగా సంపాదించుకున్న వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వాడుకుంటూ కొంద‌రు నాయ‌కుల‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గొర్ల మంద‌ల మీద తొడేళ్లు ప‌డ్డ‌ట్లుగా నా మ‌ద్ద‌తు దారుల‌పై దాడులు చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసినా, దాడులు చేసినా వారిని కొన‌లేరు' అన్నారు ఈట‌ల.

'తెలంగాణ ఉద్య‌మానికి క‌రీంన‌గ‌ర్ కేంద్ర బిందువైతే ఆ క‌రీంన‌గ‌ర్‌ను కాపాడుకున్న ప్రాంతం హుజురాబాద్‌. సంపూర్ణ మ‌ద్ద‌తు నాకే ఇస్తామ‌ని ప్ర‌జ‌లు చెప్పారు. కేసీఆర్ విజ‌యం సాధించే అవ‌కాశం లేద‌ని చెప్పారు. ఈ నియోజ‌క వ‌ర్గంలో జ‌రిగే సంగ్రామం కౌర‌వుల‌కు, పాండ‌వుల‌కు మ‌ధ్య జ‌రిగిన కురుక్షేత్ర యుద్ధంలా ఉంటుంది' అని ఈట‌ల పేర్కొన్నారు.

'తెలంగాణ‌లో ఉద్య‌మంలో పాల్గొని ఈ రోజు భంగ‌ప‌డ్డ వారంతా రేపు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఇంటికి తిరుగుతారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో యువ‌త‌, నిరుద్యోగులు, ప్రైవేటు కార్మికులు, హ‌క్కుల కోసం ఉద్య‌మిస్తోన్న వారు న‌న్ను ఆశీర్వ‌దించారు. నాకు మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని చెప్పారు' అని ఈట‌ల అన్నారు.

'కొంద‌రు వ్య‌క్తులు ఈ రోజు టీఆర్ఎస్ తొత్తులుగా, బానిస‌లుగా మారిపోయి నా మ‌ద్ద‌తుదారులు, ప్ర‌జ‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ అవ‌మానిస్తున్నారు. రాజ‌కీయంగా మిమ్మ‌ల్ని బొంద పెడ‌తాం. హుజురాబాద్ నుంచే మ‌ళ్లీ కొత్త శ‌కం ప్రారంభ‌మ‌వుతుంది.. మ‌రో ఉద్య‌మం ప్రారంభ‌మ‌వుతుంది' అని ఈటల హెచ్చరించారు.

'ఈ హుజూరాబాద్ గెలుపే ఆత్మ‌గౌర‌వంపై పోరాడుతున్న వారి గెలుపు అవుతుంది. తెలంగాణ ఉద్య‌మకారులు, ఆత్మ‌గౌర‌వం కోసం పోరాడుతున్న వారు రాష్ట్రంలో త‌మ ప్రాంతాల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్‌కి వ‌చ్చి మీ మ‌ద్ద‌తు తెల‌పాలి' అని ఈటల కోరారు.

'అడుగ‌డుగునా న‌న్ను ఆశీర్వ‌దించిన మ‌హిళ‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, మ‌ద్ద‌తుదారుల‌కు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను. వారి ఆత్మ‌గౌర‌వాన్ని నేను కాపాడతాన‌ని చెబుతున్నాను. తెలంగాణ‌లో నీతి, నిజాయ‌తితో పాల‌న కొన‌సాగ‌ట్లేదు. అవినీతి, మ‌భ్య‌పెట్టే తీరుతో పాల‌న కొన‌సాగుతోంది.

ప్ర‌గ‌తి భ‌వ‌న్ కేంద్రంగా స్క్రిప్టులు రాసి ఇస్తే కొంద‌రు నాపై మీడియా ముందు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. నేను అంటే ఏంటో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలుసు. నా గురించి తప్పుడు వ్యాఖ్య‌లు చేస్తే వారే న‌ష్ట‌పోతారు త‌ప్ప నాకేం జ‌ర‌గ‌దు' అని ఈట‌ల చెప్పారు. త‌న‌ రాజీనామా త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌లో కేసీఆర్‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పి తీరుతార‌ని ఈట‌ల‌ అన్నారు. అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బుతో ఓట‌ర్ల కొనుగోలుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు.