కరోనా దెబ్బ: వేతనాలిచ్చేందుకూ నిధుల్లేక ప్రముఖ ఫైవ్​ స్టార్​ హోటల్​ మూత

08-06-2021 Tue 12:55
  • ముంబైలోని హయత్ రీజెన్సీకి తాళం
  • మాతృ సంస్థ నుంచి నిధులు రాక నిర్ణయం
  • నిరవధికంగా మూసేస్తున్నట్టు ప్రకటన
Famous Five Star Hotel Shuts Until Further Notice under Financial Crunch

అది ముంబైలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఒకటి. కానీ, ఇప్పుడు ఉద్యోగులకు కనీసం వేతనాలివ్వలేని పరిస్థితికి వచ్చింది. కారణం కరోనా. అవును, ముంబైలోని హయత్ రీజెన్సీ అనే ఫైవ్ స్టార్ హోటల్ ను ‘నిరవధికంగా మూసేస్తున్నాం’ అని యాజమాన్యం ప్రకటించింది. ముంబై విమానాశ్రయానికి అతి సమీపంలోనే ఉండే హయత్ రీజెన్సీని ఏషియన్ హోటల్స్ (వెస్ట్) లిమిటెడ్ నిర్వహిస్తోంది.

అయితే, హోటల్ నిర్వహణకు మాతృ సంస్థ నుంచి ఇప్పటిదాకా నిధులు విడుదల కాలేదని హోటల్ జనరల్ మేనేజర్ హర్దీప్ మార్వా చెప్పారు.  దీంతో ఉద్యోగులు, సిబ్బందికి కనీసం జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి హోటల్ కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు హోటల్ ను మూసేస్తున్నట్టు తెలిపారు.

చిన్న చిన్న వ్యాపారాలనే కాదు.. పెద్ద పెద్ద బిజినెస్ లనూ మహమ్మారి దెబ్బ తీసింది. మహమ్మారి వల్ల పర్యాటక రంగంపై భారీగానే దెబ్బ పడింది. హోటళ్లు, ఆతిథ్య రంగం డీలా పడిపోయింది. పర్యాటకులు రాక, అతిథులు లేక హోటళ్లు వెలవెలబోయాయి. వ్యాపారం మొత్తం క్షీణించింది.