చాలా కాలం త‌ర్వాత మోదీతో మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే భేటీ

08-06-2021 Tue 12:51
  • ముఖ్యంగా మరాఠా రిజర్వేషన్లపై చ‌ర్చ‌
  • తుపాను సాయం, టీకాలపై చ‌ర్చిస్తోన్న నేత‌లు
  • ఉద్ధ‌వ్ వెంట అజిత్ పవార్,  అశోక్ చవాన్  
Maharashtra Chief Minister Uddhav Thackeray Deputy Chief Minister Ajit Pawar and Cabinet Minister Ashok Chavan called on Modi

ప్రధాని నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ థాక‌రే స‌మావేశం అయ్యారు. ఢిల్లీలోని ప్ర‌ధాని అధికారిక నివాసంలో కొన‌సాగుతోన్న ఈ స‌మావేశంలో ముఖ్యంగా మరాఠా రిజర్వేషన్లు, తుపాను నేప‌థ్యంలో త‌మ రాష్ట్రానికి అందాల్సిన‌ సాయం, టీకాలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఉద్ధ‌వ్ థాక‌రే వెంట మ‌హారాష్ట్ర‌ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆ రాష్ట్ర మంత్రి అశోక్ చవాన్ కూడా ఉన్నారు.

విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే. ఈ నేప‌థ్యంలో ఈ భేటీలో ఈ అంశంపై కూడా చ‌ర్చించ‌నున్నారు. కాగా, గ‌తంలో బీజేపీతో మిత్ర‌త్వాన్ని కొన‌సాగించిన శివ‌సేన మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల అనంత‌రం ఎన్డీఏకు గుడ్ బై చెప్పి ఎన్సీపీ, కాంగ్రెస్‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. చాలా కాలం త‌ర్వాత మోదీతో ఉద్ధ‌వ్ నేరుగా స‌మావేశం అయ్యారు.