కరోనా వైరస్​ మూలాలపై అమెరికా ల్యాబ్​ కీలక నివేదిక

08-06-2021 Tue 11:31
  • వుహాన్ ల్యాబ్ లోనే పుట్టిందని నిర్ధారణ
  • జన్యు మూలాలపై లారెన్స్ లైవ్ మోర్ ల్యాబ్ అధ్యయనం
  • గత ఏడాదే అమెరికా విదేశాంగ శాఖకు నివేదిక
US Report Concluded COVID 19 May Have Leaked From Wuhan Lab

కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీకైందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ అమెరికా జాతీయ లేబొరేటరీ నివేదికను రూపొందించింది. మహమ్మారి వుహాన్ ల్యాబ్ లోనే పుట్టిందని నిర్ధారించింది. దీనిపై లోతైన దర్యాప్తు జరిపించాలని సిఫార్సు చేసింది. కాలిఫోర్నియాలోని లారెన్స్ లైవ్ మోర్ నేషనల్ లేబొరేటరీ గత ఏడాది మేలో ఆ అధ్యయనాన్ని మొదలు పెట్టింది. ఆ ఏడాదే పూర్తయిన నివేదికను ప్రభుత్వానికి పంపించింది.

ట్రంప్ హయాంలోని చివరి రోజుల్లో కరోనా వైరస్ లీకేజీపై విచారణ జరిపిస్తున్న సమయంలోనే విదేశాంగ శాఖకు నివేదికను పంపినట్టు సమాచారం. కరోనా వైరస్ జన్యు మూలాల ఆధారంగానే లారెన్స్ లైవ్ మోర్ ఈ నివేదికను రూపొందించినట్టు తెలుస్తోంది.

అయితే, అమెరికా నిఘా సంస్థలు ఇప్పటికే రెండు రకాల వాదనలను వినిపిస్తున్నాయి. ఒకటి ప్రమాదవశాత్తూ వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీకవడం, రెండు.. జంతువుల నుంచి మనిషికి వైరస్ సోకడం అనే రెండు కారణాలను తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఇప్పటిదాకా ఏది నిజమన్న దానిపై మాత్రం ఇంకా తుది అంచనాకు రాలేదు.