ఉద్యోగం లేదని కుంగుబాటు.. చైనాలో ఆరుగురిని పొడిచి చంపిన యువకుడు

08-06-2021 Tue 10:06
  • వీధుల్లోకి వచ్చి కత్తితో జనంపై దాడి
  • మరో 14 మందికి తీవ్ర గాయాలు, మరొకరి పరిస్థితి విషమం
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో
 jobless man kills 6 in China

ఉద్యోగం దొరక్క మానసికంగా కుంగిపోయిన యువకుడు కత్తి పట్టుకుని రోడ్డుపైకొచ్చాడు. కనిపించిన వారిని కనిపించినట్టు పొడిచి పడేశాడు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలోని హావ్‌నింగ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన.

మెయిన్‌లాండ్‌కు చెందిన వూ  అనే 25 ఏళ్ల యువకుడు ఉద్యోగం లేకపోవడంతో మానసికంగా కుంగుబాటుకు గురయ్యాడు. దీనికితోడు కుటుంబంలో గొడవలు అతడిని మరింత వేదనకు గురిచేశాయి. కోపంతో రగిలిపోయిన అతడు కత్తిపట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. కనిపించిన వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి దాడిలో గాయపడిన బాధితులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉండడం, రోడ్డుపొడవునా రక్తపు మరకలు.. ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.