వివేకానందరెడ్డి హత్య కేసు.. మాజీ డ్రైవర్‌ను ఏడు గంటలపాటు విచారించిన సీబీఐ 

08-06-2021 Tue 07:20
  • ఢిల్లీలో నెల రోజులపాటు విచారణ
  • ఇటీవలే కడప చేరుకున్న డ్రైవర్ దస్తగిరి
  • పలు కోణాల్లో ప్రశ్నలు
  • ఆర్థిక లావాదేవీలపై ఆరా
Vivekananda Reddy Murder Case CBI questioned ex driver of viveka

మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏడు నెలల తర్వాత విచారణ తిరిగి ప్రారంభమైంది. ఆదివారం కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు నిన్న విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక మాజీ డ్రైవర్ దస్తగిరిని ఏడు గంటలపాటు విచారించి వివరాలు సేకరించారు. ఆమధ్య దస్తగిరిని సీబీఐ ఢిల్లీకి పిలిపించి, నెల రోజులపాటు విచారించి, తిరిగి కడపకు పంపింది. తాజాగా మళ్లీ ఆయనను పిలిచిన అధికారులు సుదీర్ఘంగా విచారించారు.

వివేకానందరెడ్డి హత్యకు ఆరు నెలల ముందు ఉద్యోగం నుంచి మానేయడంపై అతనిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే, అతడి ఆర్థిక లావాదేవీల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాత్రి ఏడు గంటల సమయంలో పులివెందుల వెళ్లిన అధికారులు వివేకానందరెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఇదే కేసులో మరికొందరు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించనున్నారు.