ఆహార భద్రతను దాటి దేశానికి ఆహార భరోసాను కల్పించే స్థితికి తెలంగాణ చేరుకుంది: కేసీఆర్‌

07-06-2021 Mon 20:59
  • ప్రజలకు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం శుభాకాంక్షలు
  • రూపాయికే కిలో బియ్యం
  • కుటుంబంలోని ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం
  • ఆహార భద్రత కార్డు ద్వారా నాణ్యమైన బియ్యం  
Telangana is going ahead to provide food grains confidence to entire inda

‘ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కృషి ఉందన్నారు. అనతికాలంలో రెండు కోట్ల ఎకరాల మాగాణిలో రెండు పంటలకు సరిపడా నీటిని ఇవ్వగలిగే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని అన్నారు.

దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తితో, దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలోకి ఎదుగుతోందని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ, ఆహార భద్రతను దాటి దేశానికి ఆహార భరోసాను కల్పించే స్థితికి చేరుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తిండికి లోటు ఉండకూడదనే లక్ష్యంతో, ఆహార భద్రతను కల్పిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఒక్క రూపాయికే కిలో బియ్యం అందజేస్తున్నామన్నారు. అలా కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున ఇస్తున్నామన్నారు. ‘ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు)’ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యార్థులకు సన్నబియ్యాన్ని అందిస్తోందని గుర్తుచేశారు. అలాగే రేషన్ పోర్టబిలిటీ ద్వారా తెలంగాణ పౌరులు రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు గుర్తుచేశారు.