Raghu Rama Krishna Raju: జడ్జి రామకృష్ణను జైలు నుంచి ఆసుపత్రికి తరలించడం సంతోషదాయకం: రఘురామకృష్ణరాజు

  • పీలేరు సబ్ జైలులో ఉన్న జడ్జి రామకృష్ణ
  • షుగర్ లెవల్స్ పెరిగిన వైనం
  • తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • గతంలో ఇదే అంశంపై గవర్నర్ కు లేఖ రాసిన రఘురామ
MP Raghurama Krishna Raju said he feels happy for shifting Judge Ramakrishna to Ruia Hospital

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జడ్జి రామకృష్ణను అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే ఆయన షుగర్ లెవల్స్ పెరిగిపోవడంతో పీలేరు సబ్ జైలు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఇటీవలే రఘురామరాజు.... జడ్జి రామకృష్ణ మధుమేహ బాధితుడని, ఆయనను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ఇప్పుడు జడ్జి రామకృష్ణను అధికారులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం పట్ల ఎంపీ రఘురామ హర్షం వ్యక్తం చేశారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయన షుగర్ లెవల్స్ లో తీవ్రంగా హెచ్చుతగ్గులు వస్తున్నాయని వివరించారు. ఆయనకు మెరుగైన వైద్యం అవసరమని భావించానని, అందుకే గవర్నర్ కు లేఖ రాశానని తెలిపారు. జడ్జి విషయంలో చొరవ చూపిన గవర్నర్ కు, గౌరవనీయ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు.

ఇటీవలే జడ్జి రామకృష్ణను చిత్తూరు జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు తరలించారు. చిత్తూరు జైల్లో తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన తనయుడు వంశీకృష్ణ హైకోర్టు జడ్జికి లేఖ రాశారు. దాంతో కడప జైలు, పీలేరు సబ్ జైలులో ఏదో ఒకటి ఎంచుకోవాలని జడ్జి రామకృష్ణకు ప్రతిపాదించగా, ఆయన పీలేరు సబ్ జైలుకు వెళ్లేందుకు మొగ్గుచూపారు. పీలేరు సబ్ జైలులో ఉండగా షుగర్ సంబంధింత సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఆయనకు తిరుపతి రుయాలో చికిత్స అందిస్తున్నారు.

More Telugu News