అంతరిక్షంలోకి వెళ్లనున్న జెఫ్‌ బెజోస్‌.. నవశకానికి నాంది!

07-06-2021 Mon 19:13
  • బ్లూ ఆరిజిన్‌ పేరిట వ్యోమనౌకల నిర్మాణ సంస్థను స్థాపించిన బెజోస్‌
  • సంస్థ నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి వ్యోమనౌక న్యూషెపర్డ్‌
  • జులై 20న ప్రయాణం
  • బెజోస్‌ వెంట ఆయన సోదరుడు కూడా
  • 10 నిమిషాల పాటు అంతరిక్షంలోనే
Jeff Bezos Flying into Space With his Brother On July 20

ఇప్పటి వరకు వ్యోమగాములు మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లడం చూశాం. ఇకపై పర్యాటకులు కూడా అంతరిక్షపు అందాల్ని వీక్షించనున్నారు. కొత్త శకానికి నాంది పలుకుతూ.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్‌ సహ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ జులై 20న అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఆయన సోదరుడు మార్క్‌ బెజోస్‌ కూడా వెంట వెళ్లనున్నారు.

వ్యోమనౌకల నిర్మాణ సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’ను స్థాపించిన జెఫ్‌ బెజోస్‌.. అదే సంస్థ రూపొందించిన ‘న్యూషెపర్డ్‌’ అనే వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. మొత్తం 10 నిమిషాల పాటు వీరు అంతరిక్షంలో వుంటారు. దీంట్లో 4 నిమిషాలు కర్మన్‌ లైన్‌కు ఆవల గడపనున్నారు. భూవాతావరణం, బాహ్య అంతరిక్షం మధ్య ఉండే బౌండరీనే కర్మన్‌ లైన్‌ అంటారు. బెజోస్‌ సోదరుల ప్రయాణంతో మొట్టమొదటి అంతరిక్ష పర్యాటక యాత్రకు నాంది పడనుంది. అలాగే బ్లూ ఆరిజిన్‌ నిర్మించిన వ్యోమనౌక అంతరిక్షపు అందాల్ని వీక్షించడం కోసం వెళ్లనుండడం ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా బెజోస్‌ మాట్లాడుతూ.. అంతరిక్షంలో ఎగరాలన్నది తన చిన్ననాటి కల అని.. దాన్ని సాకారం చేసుకోవడం కోసం చిన్నప్పటి నుంచి శ్రమిస్తున్నానని తెలిపారు. తన కల ఇప్పటికీ సాకారం కాబోతోందంటూ సంతోషం వ్యక్తం చేశారు. తన సోదరుడే తనకు అత్యంత ఆప్తమిత్రుడని..అందుకే అతన్ని వెంట తీసుకెళ్తున్నానని తెలిపారు.