శ్రుతిహాసన్ లా ఉండటం కష్టమన్న తమన్నా!

07-06-2021 Mon 18:31
  • శ్రుతి హాసన్ కి ధైర్యం ఎక్కువ
  • ఎప్పుడు చూసినా యాక్టివ్ గా ఉంటుంది
  • సమస్యలను లైట్ తీసుకుంటుంది
  • బాధ కలిగితే తనకి కాల్ చేస్తాను
Sruthi Hassan has lot of dare

హీరోయిన్ల మధ్య కెరియర్ పరమైన పోటీ ఎక్కువగా ఉంటుంది. అందువలన వాళ్ల మధ్య  పెద్దగా ఫ్రెండ్షిప్ ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరి అవకాశాలు వారివి .. ఎవరి సక్సెస్ లు వారివి. అందువలన ఎవరి పనులతో వారు బిజీగానే ఉంటారు. ఎక్కడైనా కలుసుకునే సందర్భాలు వచ్చినప్పుడు సహజంగానే స్నేహితులవుతుంటారు. తమ అభిరుచులు .. అలవాట్లు కూడా ఒక్కటే అనుకున్నప్పుడు ఆ స్నేహం మరింత బలపడుతుంది. అలా తమన్నా .. శ్రుతిహాసన్ మధ్య బలమైన స్నేహం కనిపిస్తుంది.

తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ .. " శ్రుతిహాసన్ తో నేను ఎక్కువ చనువుగా ఉంటాను. మేము తరచూ కలుసుకుంటూ ఉంటాము .. ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము. శ్రుతి హాసన్ చాలా ధైర్యంగా ఉంటుంది .. ఎప్పుడు చూసినా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఒక వైపున ఇంటిపనులు .. మరో వైపున షూటింగులు చక్కబెడుతూనే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎలాంటి సమస్యలైనా లైట్ తీసుకుని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా తనలా ఉండగలగడం చాలా కష్టం. నా మనసుకు ఎప్పుడైనా బాధ కలిగితే తనకే కాల్ చేస్తాను" అని చెప్పుకొచ్చింది.