ఆనందయ్య మందుకు రాజశేఖర్ రెడ్డి, జగన్ ల ఫొటోలకు, వైసీపీకి ఏమిటి సంబంధం?: గోరంట్ల

07-06-2021 Mon 18:05
  • ఆనందయ్య మందులకు అనుమతులు
  • సర్వేపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లో పంపిణీ
  • మందు డబ్బాలపై వైఎస్సార్, జగన్, చెవిరెడ్డి ఫొటోలు
  • విమర్శించిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి
Gorantla comments after photos of YCP leaders emerged on Anandaiah medicine packs

ఆనందయ్య కరోనా మందులకు అనుమతులు లభించిన నేపథ్యలో పంపిణీ షురూ అయింది. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలోనూ, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలోనూ పంపిణీ జరుగుతోంది. సర్వేపల్లి వద్ద ఆనందయ్యే స్వయంగా మందు తయారుచేస్తుండగా, చంద్రగిరిలో ఆయన తనయుడు, శిష్యులు మందు తయారుచేస్తున్నారు.

అయితే, చంద్రగిరిలో పంపిణీ చేస్తున్న ఆనందయ్య మందు డబ్బాలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫొటోలు దర్శనమిస్తున్నాయి. మందు సృష్టికర్త ఆనందయ్య పేరు తప్ప ఆయన ఫొటో మాత్రం లేదు. దీనిపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శనాత్మకంగా స్పందించారు. అసలు... ఆనందయ్య మందుకు రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫొటోలకు, వైసీపీకి ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు.

ఒక ముఖ్యమంత్రిగా మందుకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో తప్పులేదని, అయితే ఆనందయ్య మందును తామే సొమ్ము చేసుకోవాలన్న దుర్బుద్ధి ఇందులో కనిపిస్తోందని గోరంట్ల అభిప్రాయపడ్డారు. "అంతేలే... కోడికత్తిలో కోడి లేదు, గుండెపోటుకి బాబాయ్ లేడు, ఆనందయ్య మందులో ఆనందయ్య లేడు!" అంటూ సెటైర్ వేశారు.