Narendra Modi: దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ... కేంద్రానిదే ఆ బాధ్యత: ప్రధాని మోదీ కీలక ప్రకటన

  • జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని
  • ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు
  • 18 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సినేషన్
  • రాష్ట్రాలు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన పనిలేదన్న మోదీ
  • కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తుందని వెల్లడి
PM Modi announced free vaccination for everyone in the nation

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ను ఉచితంగానే అందిస్తామని ప్రకటించారు. వ్యాక్సినేషన్ కోసం ఏ రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రధాని స్పష్టం చేశారు.

వచ్చే కొన్ని నెలల్లో భారీ మొత్తంలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి కేంద్రమే డోసులు కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని వివరించారు. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లకు పైబడిన అందరికీ కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ డోసులు అందిస్తుందని వెల్లడించారు. ఎవరైనా ఉచిత టీకా వద్దనుకుంటే సొంతఖర్చుతో ప్రైవేటుగా టీకా వేయించుకోవచ్చని పేర్కొన్నారు. రూ.150 సర్వీస్ చార్జితో ప్రైవేటుగా వ్యాక్సిన్ పొందవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్లలో 25 శాతాన్ని ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

ఇక, లాక్ డౌన్ వంటి కఠిన ఆంక్షల నేపథ్యంలో, పేదలకు ఇబ్బంది కలగకుండా దీపావళి వరకు 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

More Telugu News