అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వానంద్?

07-06-2021 Mon 17:00
  • సెట్స్ పై 'మహాసముద్రం'
  • కరోనా కారణంగా ఆగిన షూటింగ్
  • శర్వాకి కథ వినిపించిన అనిల్ రావిపూడి
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్
Sharwanand in Anil Ravipudi direction

యువతరం కథానాయకులలో శర్వానంద్ కి మంచి క్రేజ్ ఉంది. మొదటి నుంచి కూడా నిదానమే ప్రధానం అన్నట్టుగా శర్వానంద్ ఒక్కో సినిమా చేస్తూ వస్తున్నాడు. కథల ఎంపిక విషయంలో తనదైన ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. నాని తరువాత ఆ రేంజ్ హీరోగా ఆయనకి డిమాండ్ ఉంది. అలాంటి శర్వానంద్ కి కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవుతూ వస్తున్నాయి. ఇటీవల వచ్చిన 'శ్రీకారం' కూడా నిరాశపరిచింది.  

ఇప్పుడు శర్వానంద్ తాజా చిత్రంగా 'మహాసముద్రం' రూపొందుతోంది. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలోను ఆయన ఒక సినిమాను చేయనున్నాడనే టాక్ తాజాగా వినిపిస్తోంది. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగిపోయినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 'ఎఫ్ 3' పనుల్లో ఉన్న అనిల్ రావిపూడి, బాలకృష్ణతో కూడా ఒక సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. మరి ఈ రెండు ప్రాజెక్టులలో ముందుగా అనిల్ రావిపూడి ఏ సినిమాను పట్టాలెక్కిస్తాడో చూడాలి.