నా పుట్టినరోజు సందర్భంగా ఎవరూ రావొద్దు... ఒక్క అభిమాని దూరమైనా భరించలేను: బాలకృష్ణ

07-06-2021 Mon 15:57
  • జూన్ 10న బాలయ్య పుట్టినరోజు
  • ప్రతి ఏటా ఘనంగా వేడుకలు
  • కరోనా విలయతాండవం చేస్తోందన్న బాలయ్య
  • అభిమానులు ఇళ్లలోనే ఉండాలని సూచన
  • అదే తనకు పుట్టినరోజు వేడుక అని స్పష్టీకరణ
Nandamuri Balakrishna insists fans do not come out for his birthday celebrations

టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జూన్ 10న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ప్రతి ఏటా నందమూరి అభిమానులు బాలయ్య జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ప్రస్తుతం కరోనా సంక్షోభం నెలకొని ఉన్న తరుణంలో, తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎవరూ తరలి రావొద్దని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. "నా ప్రాణ సమానులైన అభిమానులకు" అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన వెలువరించారు.

"ప్రతి ఏటా నా పుట్టినరోజు సందర్భంగా నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బయటికి రావడం అభిలషణీయం కాదు. మీ అభిమానమే నన్ను ఇంతటివాడ్ని చేసింది...  ఒక్క అభిమాని దూరమైనా భరించలేను. మీ అభిమానంతో సాటిరాగల ఆశీస్సు లేదు, మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడపడమే నా జన్మదిన వేడుకగా భావిస్తాను. దయచేసి ఎవరూ రావొద్దు" అని బాలయ్య తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కాలంలో అసువులు బాసిన అభిమానులకు, కార్యకర్తలకు, అభాగ్యులకు నివాళులు అర్పిస్తున్నానంటూ పేర్కొన్నారు.