ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సీతక్క తల్లి... ధైర్యం చెప్పిన చంద్రబాబు

07-06-2021 Mon 15:05
  • అనారోగ్యంతో బాధపడుతున్న సమ్మక్క
  • హైదరాబాదు ఏఐజీలో చికిత్స
  • పరామర్శించిన చంద్రబాబు
  • సీతక్క ఘనతల గురించి వైద్యులకు చెప్పిన చంద్రబాబు
  • భావోద్వేగాలకు లోనైన సీతక్క
Chnadrababu visits AIG and consoles MLA Seethakka mother

ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క తల్లి సమ్మక్క హైదరాబాదులోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సమ్మక్కను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే సీతక్కతోనూ, ఏఐజీ వైద్యులతోనూ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగాలకు గురయ్యారు. సీతక్క నిరాడంబరత, ప్రజాసేవ, క్రమశిక్షణ తదితర అంశాలను చంద్రబాబు అక్కడి వైద్యులకు వివరించారు. ఆమె అవలంబిస్తున్న సేవా తత్పరత పట్ల చంద్రబాబు అభినందించారు.

తన గురించి చంద్రబాబు అంతటి నేత ప్రత్యేకంగా వివరించడంతో సీతక్క ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. దీని గురించి ఆమె ట్విట్టర్ లో వెల్లడించారు. తన తల్లిని పరామర్శించడమే కాకుండా, తమకు ధైర్యం చెప్పారని తెలిపారు. చంద్రబాబును సీతక్క తన ఆత్మీయ సోదరుడు అని అభివర్ణించారు. థాంక్స్ అన్నా అంటూ సీతక్క తన ట్విట్టర్ అకౌంట్లో చంద్రబాబు సందర్శన వీడియోను పంచుకున్నారు.