ఏపీలో 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

07-06-2021 Mon 14:12
  • మరో రెండు గంటలు మినహాయింపులు
  • ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు సడలింపులు
  • కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో నిర్ణయం
AP Extends Curfew Till June 20

పగటి పూట కర్ఫ్యూపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వరకు కర్ఫ్యూను పొడిగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుతున్నా.. పూర్తిగా అదుపులోకి రాలేదు. 10న కర్ఫ్యూ గడువు పూర్తి కానుండడంతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కర్ఫ్యూ అమలుపై అధికారులతో నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేసులు మరింత తగ్గే వరకు కర్ఫ్యూ కొనసాగించడమే మంచిదని సమావేశంలో నిర్ణయించారు.

అధికారులు అందజేసిన నివేదికలను పరిశీలించిన ఆయన.. 20 వరకు కర్ఫ్యూను పొడిగించారు. అయితే, కర్ఫ్యూలో మినహాయింపుల వ్యవధిని పెంచారు. మరో రెండు గంటలు అదనపు సమయాన్ని కేటాయించారు. ఇప్పటిదాకా ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ పనుల కోసం అనుమతులిస్తున్నా.. ఇప్పుడు దానిని రెండింటి వరకు పెంచారు. జూన్ 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.