ముగ్గురు ఆడపిల్లల్ని కన్నదన్న కోపంతో.. భార్య, పిల్లలను బావిలోకి తోసేసిన భర్త

07-06-2021 Mon 12:36
  • ఎనిమిదేళ్ల పెద్దమ్మాయి మృతి
  • 6 నెలల పసికందుతో బయటపడిన మహిళ
  • మధ్యప్రదేశ్ లోని ఛాతర్ పూర్ లో ఘటన
Angry with wife for delivering 3 daughters MP man throws wife and two kids

ముగ్గురూ ఆడపిల్లల్నే కన్నదని భార్యపై కోపాన్ని పెంచుకున్నాడా భర్త. మగ పిల్లాడ్ని కనట్లేదంటూ తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆదివారం భార్య, ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేశాడు. ఈ ఘటనలో వారి పెద్ద పాప (8 ఏళ్లు) చనిపోగా, అతడి భార్య, ఆరు నెలల పసికందు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఛాతర్ పూర్ గ్రామంలో జరిగింది.

పుట్టింటికెళ్లి తన భార్యాపిల్లలను తీసుకొచ్చే క్రమంలో ఛాతర్ పూర్ లోని బావి వద్ద బైక్ ను ఆపిన అతడు.. ముగ్గుర్నీ బావిలోకి తోసేశాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు. భార్య ఎలాగోలా బయటపడి గ్రామస్థుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మగపిల్లాడిని కనలేదన్న కోపంతో గత కొంతకాలంగా భార్యను, పిల్లలను చంపేస్తానంటూ అతడు బెదిరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. కాగా, మరో అమ్మాయి మాత్రం వీరితో రాకుండా అమ్మమ్మ  దగ్గరే ఉండిపోయింది.