Andhra Pradesh: రైతులను దళారులు దోచేస్తున్నా ప్రభుత్వానికి పట్టట్లేదు: దేవినేని ఉమ

Devineni Uma Fires on Govt Over Paddy Procurement
  • రైతు భరోసా కేంద్రాలుండీ ఏం లాభం?
  • ధాన్యం కల్లాల్లోనే మూలుగుతోంది
  • మిల్లర్లు, దళారులు మద్దతు ధర ఇవ్వట్లేదు
  • రూ.800 మాత్రమే ఇస్తున్నారు
  • తరుగు పేరిట 10 కిలోలు దోచేస్తున్నారని ఆరోపణ
మిల్లర్లు, దళారులు తరుగు పేరుతో రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఇవ్వాళ ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని చండ్రగూడెం గ్రామంలో ధాన్యం కల్లాలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మార్కెట్ యార్డ్ లలో ధాన్యాన్ని కొనడం లేదని ఆరోపించారు. దీంతో రైతులు పండించిన ధాన్యమంతా కల్లాల్లోనే మూలుగుతోందన్నారు.

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారులు, మిల్లర్లు మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాకు రూ.1,416 ఇవ్వాల్సి ఉన్నా.. రూ.800 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. తరుగు పేరుతో 10 కిలోలు దోచేస్తున్నారని ఆరోపించారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదన్నారు. రైతు భరోసా కేంద్రాలు దేనికీ పనికిరావడం లేదని మండిపడ్డారు. అలాంటి ఉత్తుత్తి కేంద్రాలతో ఎవరికి లాభమని ఆయన ప్రశ్నించారు.

తాడేపల్లి రాజప్రాసాదానికి వేల కోట్లు ముడుతున్నాయని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్, మంత్రులు మీడియాతో మాట్లాడాలన్నారు. అక్రమాలపై నిలదీస్తున్నందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రభుత్వం శునకానందం పొందుతోందని మండిపడ్డారు.
Andhra Pradesh
Telugudesam
Devineni Uma

More Telugu News