క‌మ‌లా హారిస్ ప్ర‌యాణించిన విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌లు.. తిరిగి వెన‌క్కి వ‌చ్చేసిన విమానం

07-06-2021 Mon 11:18
  • పైలె‌ట్లు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో త‌ప్పిన ప్ర‌మాదం
  • మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాలకు బ‌య‌లుదేరిన విమానం
  • సాంకేతిక సమస్యలు తలెత్తిన‌ట్లు గుర్తించిన‌ పైలెట్లు
  • సుర‌క్షితంగా ఉన్నామ‌ని క‌మ‌ల ట్వీట్
kamala escapes from accident

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలె‌ట్లు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆమె ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. క‌మ‌లా హారిస్ మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాల‌కు ఎయిర్‌ఫోర్స్-2 విమానంలో బయల్దేరిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

మేరీల్యాండ్ నుంచి విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే  విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తిన‌ట్లు పైలెట్లు గుర్తించి, విమానాన్ని తిరిగి మేరీల్యాండ్‌లో ల్యాండ్ చేయ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై క‌మ‌లా హారిస్ స్పందించారు. తామంతా సురక్షితంగానే ఉన్నట్టు  తెలిపారు.

విమానం సురక్షితంగా ల్యాండ్ కావాలని మేము ప్రార్థించామని, క్షేమంగానే దిగామ‌ని ఆమె మీడియాకు చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగానే విమానం అత్యవసరంగా మేరీల్యాండ్‌లో దిగింద‌ని ఓ అధికారి నిర్ధారించారు. అనంత‌రం క‌మ‌లా హారిస్ మరో విమానంలో గ్వాటెమాల‌కు బయల్దేరారు.