ఢిల్లీలో తెరుచుకున్న మాల్స్, మెట్రో రైళ్లు: ప్రజలకు సీఎం కేజ్రీవాల్​ సూచనలు

07-06-2021 Mon 11:16
  • నిర్లక్ష్యంగా ఉండొద్దని హితవు
  • మాస్కులు ధరించి దూరం పాటించాలని సూచన
  • కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి
  • సగమే నడుస్తున్న మెట్రో రైళ్లు
CM Kejriwal urges people to follow Covid19 norms

ఇవ్వాళ్టి నుంచి ఢిల్లీలో వ్యాపార, రవాణా కార్యకలాపాలన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. ఇన్నాళ్లూ కరోనా కేసులతో అల్లాడిపోయిన దేశ రాజధాని.. ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాక్ డౌన్ ను క్రమక్రమంగా ఎత్తేస్తున్నారు. మాల్స్, షాపులు, మెట్రో ఓపెన్ అయ్యాయి.

అయితే, లాక్ డౌన్ సడలింపులు పెంచుతున్నామని నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ ప్రజలకు కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడేందుకు కృషి చేస్తూనే.. కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇవ్వాళ్టి నుంచి షాపులు, మాల్స్, మెట్రో వంటివి తెరుచుకుంటున్నందున కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచనలు చేశారు.

కరోనా నివారణకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోవద్దని హితవు చెప్పారు. కాగా, వచ్చిపోయే వినియోగదారుల కోసం మాల్స్ రక్షణ చర్యలు చేపడుతున్నాయి. దాని కోసం ప్రత్యేకంగా రియల్ టైంలో ఎంత మంది వచ్చిపోతున్నారో లెక్కలు తీయాలని నిర్ణయించుకున్నాయి.

మెట్రో ప్రారంభమైనా ప్రస్తుతానికి సగం రైళ్లనే నడుపుతున్నారు. రైళ్ల వేళల్లోనూ మార్పులు చేశారు. ఇంతకు ముందు ఐదు నిమిషాలకో రైలు వచ్చేది. ఇప్పుడు దానిని 15 నిముషాలకు పెంచారు. కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండడంతో రెండు నెలల క్రితం ఢిల్లీలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కఠిన ఆంక్షలు, నిర్ణయాలతో అక్కడ కేసులు 400 దిగువకు వచ్చేశాయి.