పిసినారి పాత్రలో సందడి చేయనున్న రాజేంద్రప్రసాద్

07-06-2021 Mon 11:10
  • జంధ్యాల మార్కు కామెడీ
  • అప్పట్లో నవ్వులు పూయించిన 'అహ నా పెళ్లంట'
  • కోట తరహా పాత్రలో రాజేంద్ర ప్రసాద్    
 Rrajendra Prasad is seen as in a different role in F3

టాలీవుడ్ దర్శకులలో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారిలో అనిల్ రావిపూడి ఒకరుగా కనిపిస్తాడు. తన అభిమాన దర్శకుడు జంధ్యాల అయితే, తన అభిమాన నటుడు రాజేంద్రప్రసాద్ అని అనిల్ రావిపూడి తరచూ చెబుతూ ఉంటాడు. ఈ సారి ఆయన జంధ్యాలను గుర్తు చేస్తూ, రాజేంద్రప్రసాద్ ను ఒక ముఖ్యమైన పాత్రలో చూపించనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయాన్ని గురించే ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమా రూపొందుతోంది. కరోనా కారణంగా వాయిదాపడిన షూటింగు త్వరలో మొదలుకానుంది. 'ఎఫ్ 2'లో 'భార్యలను ప్రేమగా చూసుకోవాలోయ్' అంటూ రెండో భార్యతో దొరికిపోయే పాత్రలో నవ్వించిన రాజేంద్ర ప్రసాద్, 'ఎఫ్ 3' సినిమాలో పరమ పిసినారి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. జంధ్యాల సినిమా 'అహ నా పెళ్లంట'లో ప్రతి విషయానికి 'అయితే నాకేంటి?' అంటూ పిసినారి పాత్రలో కోట చేయిజాపుతూ ఉంటాడు. అదే తరహా పాత్రలో రాజేంద్రప్రసాద్ సందడి చేయనున్నాడని చెబుతున్నారు.