తెలంగాణలో సాయంత్రం ఐదు గంటల వరకు కరోనా ఆంక్షల సడలింపు?

07-06-2021 Mon 07:54
  • కేసీఆర్ అధ్యక్షతన రేపు మంత్రిమండలి సమావేశం
  • జనం ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట వెసులుబాటు
  • రాత్రిపూట పకడ్బందీగా కర్ఫ్యూ అమలు
Lockdown restrictions to be eased in Telangana

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో కరోనా ఆంక్షలను మరింతగా సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఒంటిగంట వరకు సడలింపులు ఉండగా, దీనిని సాయంత్రం 5 గంటల వరకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, ఆ సమయంలో రోడ్లపై ఉన్న వారు ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా మరో గంట సమయం ఇవ్వాలని భావిస్తోంది.

 ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 9తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షలను మరింతగా సడలించడంతోపాటు రాత్రిపూట మాత్రం కర్ప్యూను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.