America: మాస్క్ ధరించి వస్తే ఆ రెస్టారెంటులో ఎక్ స్ట్రా 'వడ్డన'!

  • మాస్క్ నిబంధనను ఎత్తేసిన అమెరికా
  • ఫిడిల్‌హెడ్ రెస్టారెంట్‌లో విస్తుపోయే నిబంధన
  • మాస్క్ ధరించి వస్తే బిల్లుపై అదనంగా 5 డాలర్ల వడ్డింపు
California cafe owner charges customers 5 dollars fee for wearing masks

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. మాస్క్ ధరించకుంటే మన దేశం, మన ప్రాంతంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు జరిమానాలు విధిస్తున్నాయి. అయితే, దేశంలో సగం మందికిపైగా టీకాలు వేయడం, కేసులు తగ్గుముఖం పట్టడంతో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని అమెరికా వంటి దేశాలు ప్రకటించాయి. అయితే, ఇప్పుడు అదే దేశంలోని కాలిఫోర్నియాలో ఫిడిల్‌హెడ్ కేఫ్ రెస్టారెంట్ విస్తుపోయే నిబంధనను అమలు చేస్తోంది. మాస్క్ ధరించి వచ్చే వినియోగదారులకు జరిమానా వేస్తోంది. బిల్లుపై అదనంగా 5 డాలర్లు వడ్డిస్తోంది.

నిజానికి అమెరికాలో మాస్క్ ధరించడం తప్పనిసరి కాకున్నా ముందుజాగ్రత్త చర్యగా కొందరు, భయంతో మరికొందరు మాస్కులు ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్ ఈ నిబంధన తీసుకొచ్చింది. చాలామంది వినియోగదారులు జరిమానా చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు కానీ, మాస్క్‌ తీసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. కాగా, ఇలా జరిమానాల రూపంలో వసూలైన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు అందిస్తామని రెస్టారెంట్ యజమాని క్రిస్ కాస్టిల్‌మ్యాన్ తెలిపారు.

More Telugu News