ఆనందయ్య మందు పంపిణీలో స్వల్ప తోపులాట.. ఇతర ప్రాంతాల వారు రావొద్దని విజ్ఞప్తి

07-06-2021 Mon 06:47
  • ప్రతి జిల్లాలో 5 వేల మందికి ఉచితంగా పంపిణీ చేస్తాం
  • తొలుత సర్వేపల్లి నియోజకవర్గంలో అందిస్తాం
  • మిగతా ప్రాంతాల్లో ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తాం
  • ఆనందయ్య వీడియో సందేశం
Anandayya Released video message to public

ఆనందయ్య నిన్న కృష్ణపట్నంలో పరిమిత సంఖ్యలో కరోనాకు ఔషధాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. మందు పంపిణీ సమయంలో పోలీసుల పర్యవేక్షణ కొరవడడంతో భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి.

ఈ నేపథ్యంలో ఆనందయ్య గత రాత్రి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇతర ప్రాంతాల వారు ఎవరూ కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులు పడొద్దని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాలోనూ ఐదు వేల మంది కరోనా బాధితులకు ఉచితంగా మందును పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి చేతుల మీదుగా తొలుత మందు పంపిణీని ప్రారంభిస్తామన్నారు. మిగతా ప్రాంతాల్లో మందును ఎప్పుడు పంపిణీ చేసేదీ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాబట్టి ఇతర ప్రాంతాల వారు కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులు పడొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.