ఫేవరెట్ బ్యాట్స్ మన్ ఎవరంటే ఠక్కున కోహ్లీ పేరు చెప్పిన పాక్ క్రికెటర్ అర్ధాంగి

06-06-2021 Sun 21:08
  • లైవ్ చాట్ నిర్వహించిన హసన్ అలీ భార్య షామియా
  • నెటిజన్ల ప్రశ్నలకు జవాబులు
  • కోహ్లీపై అభిమానం చాటుకున్న షామియా
  • షామియా స్వస్థలం హర్యానా
  • హసన్ అలీతో ప్రేమ... ఆపై వివాహం
Pakistan cricketer Hassan Ali wife Shamia named Kohli as her favorite batsman

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. దేశాలకు అతీతంగా కోహ్లీని ఆరాధిస్తుంటారు. మైదానంలో తన ఆటతీరుతోనే కాకుండా, హావభావాలు, దూకుడుతోనూ కోహ్లీ అలరిస్తుంటాడు. కాగా, పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ భార్య షామియా కూడా కోహ్లీ అభిమానుల జాబితాలో చేరిపోయింది. షామియా  తాజాగా సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీ ఫేవరెట్ బ్యాట్స్ మన్ ఎవరంటూ ఓ నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు. అందుకు షామియా ఏమాత్రం ఆలోచించకుండా విరాట్ కోహ్లీ అని చెప్పేసింది.

అన్నట్టు... షామియా సొంతదేశం భారతదేశమే. హర్యానాకు చెందిన ఆమె ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ లో ఫ్లయిట్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హసన్ అలీ... షామియాతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారగా, పెద్దల అనుమతితో రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. కాగా, పాక్ జట్టులో హసన్ అలీ ప్రధాన బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఫార్మాట్ ఏదైనా నైపుణ్యం ప్రదర్శిస్తూ జట్టులో కీలక బౌలర్ గా ఎదిగాడు.