KTR: కేరళ నర్సులను మలయాళంలో మాట్లాడొద్దన్న ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రి... తీవ్రంగా స్పందించిన కేటీఆర్

  • మరోసారి తెరపైకి భాషా వివాదం
  • ఢిల్లీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న కేరళ నర్సులు
  • మలయాళంలో మాట్లాడుతున్నారంటూ రోగి ఫిర్యాదు!
  • హిందీ, ఇంగ్లీషులోనే మాట్లాడాలన్న ఢిల్లీ ఆసుపత్రి వర్గాలు
KTR opines on Kerala nurses language row

ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో కేరళ నర్సులు వారి మాతృభాష మలయాళంలో మాట్లాడడంపై ఆసుపత్రి వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదం రూపుదాల్చింది. కేరళ నర్సులు విధుల్లో ఉన్నప్పుడు కేవలం హిందీ, ఇంగ్లీషులోనే మాట్లాడాలని ఆసుపత్రి నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు.

దీనిపై ఓ కేరళ నర్సు స్పందిస్తూ, గతంలో ఎన్నడూ ఇలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. ఓ రోగి తమ భాషపై ఫిర్యాదు చేసినట్టు తెలిసిందని, దాంతో సెక్రటేరియట్ నుంచే ఆదేశాలు వచ్చినట్టు వెల్లడైందని తెలిపారు. కానీ ఇది చాలా తప్పు అని, ఇక్కడ 60 శాతం మంది నర్సులు కేరళ నుంచి వచ్చినవారేనని, మాతృభాషలో మాట్లాడుకోకుండా ఎలా ఉంటారని ఆమె ప్రశ్నించారు. అయితే ఇది రోగులతో మలయాళంలో మాట్లాడినందుకు తీసుకున్న చర్యలా అనిపించడంలేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా, ఈ అంశంపై తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ తరహా ఆదేశం భాషా ఆధిక్యత ధోరణులను తిరిగి తీసుకువచ్చినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. భారత్ లో 22 భాషలను అధికారిక భాషలుగా గుర్తించారని, వాటిలో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ తదితర భాషలున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతి భారతీయ పౌరుడు తనకిష్టమైన భాషలో మాట్లాడుకునే హక్కు ఉందని, ఈ ప్రాథమిక హక్కుకు ఎవరూ భంగం కలిగించలేరని స్పష్టం చేశారు.

More Telugu News