బిగ్ బాస్-5 కంటెస్టెంట్లు వీళ్లేనా...?

06-06-2021 Sun 19:26
  • త్వరలోనే బిగ్ బాస్ ఐదో సీజన్
  • ప్రస్తుతం కంటెస్టెంట్లకు ఇంటర్వ్యూలు!
  • తుది జాబితా ఖరారైతే క్వారంటైన్
  • హోస్ట్ గా ఈసారి కూడా నాగార్జునే!
Bigg Boss fifth season will go in a few weeks

కరోనా సమయంలోనూ గతేడాది నిర్వహించిన బిగ్ బాస్ నాలుగో సీజన్ హిట్టవడంతో ఇప్పుడందరి దృష్టి బిగ్ బాస్-5పై పడింది. తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ రికార్డు స్థాయిలో టీఆర్పీ సాధిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే.... త్వరలోనే బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

వాస్తవానికి బిగ్ బాస్-5ను కాస్త ముందే నిర్వహించాలని నిర్వాహకులు భావించినా, సరిగ్గా అదే సమయంలో సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నట్టు అర్థమవుతోంది. ఇక, గత సీజన్ల లాగానే ఈసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడం ఖాయంగానే కనిపిస్తోంది. తాజా సీజన్ కోసం జూమ్ ద్వారా కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తున్నారని, కంటెస్టెంట్ల ఫైనల్ లిస్టు ఖరారైతే వారికి క్వారంటైన్ పూర్తి చేసి జూలైలో షో ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇక, బిగ్ బాస్-5 కోసం శేఖర్ మాస్టర్, మంగ్లీ, హైపర్ ఆది, వర్షిణి (యాంకర్), ప్రత్యూష (యాంకర్), షణ్ముఖ్ జశ్వంత్ (యూట్యూబర్), దుర్గారావు (టిక్ టాక్ ఫేమ్), ప్రవీణ్ (కమెడియన్), శివ (యాంకర్)ల పేర్లు తెరపైకి వచ్చాయి. దీనిపై మరికొన్ని వారాల్లో మరింత స్పష్టత రానుంది.