Automobile: కార్ల ధరలు పెంచిన రెనో!

  • ఈ ఏడాదిలో ధరలు పెంచడం ఇది మూడోసారి
  • మోడల్‌ను బట్టి రూ.7,095-రూ.39,030 వరకు పెంపు
  • క్విడ్‌,కైగర్‌,ట్రైబర్‌,డస్టర్‌ మోడళ్లపై ధరల పెంపు
  • నిర్వహణ ఖర్చు, తయారీ వస్తువుల వ్యయం పెరగడమే కారణం
Renault Hiked prices of various models

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియా కార్ల ధరలను పెంచింది. మోడల్‌ను బట్టి ఈ పెంపు రూ.7,095-రూ.39,030 వరకు ఉంది. తాజా పెంపుతో క్విడ్‌, కైగర్‌, ట్రైబర్‌, డస్టర్‌ మోడళ్ల ధరలు మారాయి. ఈ ఏడాది ధరలను పెంచడం రెనో ఇది మూడోసారి. నిర్వహణ ఖర్చు, తయారీ వస్తువుల ధరలు పెరగడమే ధరల పెంపునకు కారణమని కంపెనీ పేర్కొంది. ధరల పెంపును ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. క్విడ్‌ స్టాండర్డ్‌ 0.8 లీటర్‌ ఇంజిన్‌ కలిగిన వేరియంట్‌ ధర రూ.3.32 లక్షలతో ప్రారంభమైంది. దీంట్లో టాప్ వేరియంట్‌ అయిన క్లైంబర్‌ ఏఎంటీ(ఓ) వేరియంట్‌ ధర రూ.5.48 లక్షలుగా నిర్ణయించారు. ఇక స్టాండర్డ్‌ ఆర్‌ఎక్స్‌ఈ, ఆర్‌ఎక్స్‌ఎల్‌, ఆర్‌ఎక్స్‌టీ వేరియంట్‌ ధర రూ.13,900 వరకు పెరిగింది. ఇక 1.0 లీటర్ వేరియంట్‌ ఆర్‌ఎక్స్‌ఎల్‌, ఆర్‌ఎక్స్‌టీ(ఎ), ఆర్‌ఎక్స్‌టీ ఏఎంటీ(ఓ), ఆర్‌ఎక్స్‌ఎల్‌ ఏఎంటీ వేరియంట్ల ధరలు రూ.9,000 వరకు పెంచారు.

ఇక రెనో డస్టర్‌ ఫ్లాగ్‌షిప్‌ 1.5 లీటర్‌ పెట్రోల్‌, 1.3 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్స్ కలిగిన మోడళ్ల ధరలు రూ.13,050 వరకు పెరిగాయి. డస్టర్‌ కంపాక్ట్‌ ఎస్‌యూవీ ధర రూ.9.86 లక్షల వద్ద ప్రారంభమై.. రూ.14.25 లక్షల వరకు చేరింది.

ఇక ట్రైబర్‌ ఎంపీవీ మోడల్‌ ధరలు రూ.20,000 వేల వరకు.. కైగర్‌ సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ధరలు రూ.39,030 వరకు పెరిగాయి. ప్రస్తుతం ట్రైబర్‌ మోడల్‌ కార్లు రూ.5.5 లక్షల నుంచి రూ.7.95 లక్షల మధ్య లభిస్తుండగా.. కైగర్‌ వేరియంట్లు రూ.5.64 లక్షల నుంచి రూ.10.08 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.

More Telugu News