Mehul Choksi: మీకేం సమాచారం కావాలో అడగండి... అన్నీ చెబుతా: భారత అధికారులకు తెలిపిన మేహుల్ చోక్సీ

Mehul Choksi offers Indian officials to ask him anything
  • పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ
  • 2018లో దేశం విడిచి పరారీ
  • రెండేళ్లుగా ఆంటిగ్వాలో నివాసం
  • ఇటీవల డొమినికా పోలీసులకు పట్టుబడ్డ వైనం
వేల కోట్ల పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ (62) ప్రస్తుతం డొమినికా దేశ పోలీసుల అదుపులో ఉన్నాడు. భారత్ నుంచి ఆంటిగ్వా అండ్ బార్బుడా దేశంలోని తన నివాసానికి వెళ్లిన మేహుల్ చోక్సీ ఇటీవల తన గాళ్ ఫ్రెండ్ తో బోట్ లో విహరిస్తూ డొమినికా వెళ్లగా, అక్కడి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చోక్సీని భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అతడిపై డొమినికా హైకోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మేహుల్ చోక్సీ భారత అధికారులకు ఆహ్వానం పలికారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఏ విచారణకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని చోక్సీ ఉద్ఘాటించారు. భారత్ లో తాను చట్టాలను అతిక్రమించలేదని, భారత్ లో చట్టపరంగా తనపై ఎలాంటి వారెంట్ అమల్లో లేదని పేర్కొన్నారు. వైద్య చికిత్స కోసం భారత్ నుంచి అమెరికా వచ్చానని, ఆ సమయంలో తనపై వారెంట్లేవీ లేవని స్పష్టం చేశాడు.

భారత్ లో రూ.13,500 కోట్ల మేర పీఎన్బీ స్కాం వెల్లడి కావడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ... మేహుల్ చోక్సీ మేనల్లుడే. ఈ స్కాం తెరపైకి రావడానికి కేవలం కొన్నిరోజుల ముందే చోక్సీ దేశం విడిచి పరారయ్యారు. గత రెండేళ్లుగా ఆయన ఆంటిగ్వాలో ఉంటున్నారు.
Mehul Choksi
India
Officials
Dominica
PNB Scam

More Telugu News