తిమింగలం కడుపులో విలువైన పదార్థం... జాక్ పాట్ కొట్టిన జాలర్లు

06-06-2021 Sun 15:54
  • సముద్రంలో వేటకు వెళ్లిన యెమెన్ జాలర్లు
  • మృత తిమింగలం దర్శనమిచ్చిన వైనం
  • దాని పొట్టకోసిన జాలర్లు
  • తిమింగలం కడుపుతో అంబగ్రిస్ పదార్థం
  • మార్కెట్లో దాని విలువ రూ.10 కోట్లు
Yemen fishermen gets valuable Ambergris

పశ్చిమ యెమన్ మత్స్యకారుల అదృష్టం మామూలుగా లేదు. ఓ చనిపోయిన తిమింగలం వారిని కోటీశ్వరులను చేసింది. వేటకు వెళ్లిన వారికి సముద్రంలో మృత తిమింగలం కళేబరం కనిపించింది. అయితే తిమింగలాల కడుపులో అంబగ్రిస్ పదార్థం ఉంటుందని వారికి తెలుసు. అది ఎంత విలువైనదో కూడా వారికి తెలుసు.

సాధారణంగా తిమింగలం ఉమ్మినప్పుడో, వాంతి చేసుకున్నప్పుడో ఈ పదార్థం బయటికి వస్తుంటుంది. ఈ అంబగ్రిస్ తో తయారుచేసిన సుగంధ ద్రవ్యాలకు భారీ డిమాండ్ ఉంటుంది. దీనితో తయారుచేసిన సెంటు ఒక చిన్న బాటిల్ కూడా లక్షల్లో ధర పలుకుతుంది. అందుకే సముద్రంలో వేటకు వెళ్లే జాలర్లు ఈ అంబగ్రిస్ ను అదృష్టదేవతగా భావిస్తుంటారు.

ఈ నేపథ్యంలో, తమ కంటబడిన ఆ స్పెర్మ్ వేల్ కళేబరాన్ని జాలర్లు కత్తులతో చీల్చి చూడగా, వారు ఊహించినట్టే దాని పొట్టలో అంబగ్రిస్ పదార్థం కనిపించింది. దాన్ని మార్కెట్ వర్గాలకు చూపించగా, రూ.10 కోట్ల విలువ చేస్తుందని వారు తెలిపారు. దాంతో ఆ యెమెన్ మత్స్యకారుల ఆనందం అంతాఇంతా కాదు. ఈ మొత్తాన్ని వేటకు వెళ్లిన 35 మంది జాలర్లు పంచుకోనున్నారు.