టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై విజయవాడ పటమట పీఎస్ లో కేసు నమోదు

06-06-2021 Sun 15:12
  • మే 29న ఓ హోటల్లో సంగం పాలకవర్గం భేటీ
  • కరోనా నిబంధనలు ఉల్లంఘించారన్న పోలీసులు
  • పలు సెక్షన్ల కింద పాలకవర్గంపై కేసు
  • కంపెనీ సెక్రటరీని పిలిపించి విచారణ
  • నిబంధనలు పాటించామంటున్న సంగం పాలకవర్గం
Police case files on Dhulipalla and Sangam Dairy board members

సంగం డెయిరీ వ్యవహారంలో ఇటీవలే బెయిల్ పై విడుదలైన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పైనా, సంగం డెయిరీ పాలకవర్గ సభ్యులపైనా విజయవాడలో కేసు నమోదైంది. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి మే 29న ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై పటమట పీఎస్ లో కేసు నమోదు చేశారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా సమావేశం జరిపారంటూ పటమట పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ కిశోర్ కుమార్ ఫిర్యాదు చేయడంతో, ఈ కేసు నమోదైంది. సమావేశం జరిగినప్పటి సీసీ కెమెరా ఫుటేజిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, ధూళిపాళ్ల, తదితరులపై ఐపీసీ 269, 270, రెడ్ విత్ 34, 188 సెక్షన్లతో పాటు, అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదైంది.

అయితే, తమపై కేసు నమోదు చేయడాన్ని సంగం డెయిరీ పాలకవర్గం ఖండించింది. తాము నిబంధనలకు అనుగుణంగానే సమావేశం నిర్వహించామని స్పష్టం చేసింది. దీనిపై పోలీసులు సంగం డెయిరీ కంపెనీ కార్యదర్శిని పిలిపించి విచారణ జరిపారు.