Maharashtra: అజిత్​ పవార్​ తో ప్రభుత్వ ఏర్పాటు పెద్ద పొరపాటే: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్​

  • ఆ నిర్ణయానికి చింతించట్లేదని కామెంట్
  • అప్పుడు అందరి కోపానికి గురయ్యానని ఆవేదన
  • తన పేరు మొత్తం పోయిందని వెల్లడి
Forming Govt with Ajith Pawar a Big Mistake Says Devendra Fadnavis

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, శరద్ పవార్ తమ్ముడు అజిత్ పవార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం పొరపాటేనని, అయినా తాను చేసిన పనికి చింతించట్లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. వివిధ దినపత్రికల ఎడిటర్లతో నిర్వహించిన ఆన్ లైన్ మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

2019లో ఫలితాలు వచ్చాక అజిత్ పవార్ తో కలిసి ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆదరాబాదరాగా సీఎం, డిప్యూటీ సీఎంలుగా వారిద్దరు ప్రమాణం కూడా చేశారు. కానీ, ఆ ప్రభుత్వం నాలుగు రోజులు కూడా నిలబడలేదు. దీంతో మహా వికాస్ అగాఢీ (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అయితే, తాజాగా ఫడ్నవీస్ నాడు తీసుకున్న నిర్ణయంపై వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తనను వెన్నుపోటు పొడిచారన్నారు. అయితే, రాజకీయాల్లో నిలవాలంటే అలాంటి వాటిని ఎదుర్కోవాల్సిందేనన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ, కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. చాలా మంది కోపంగా కూడా ఉన్నారన్నారు.

తన నిర్ణయం వల్ల పార్టీ కార్యకర్తల ముందు తన పేరు మొత్తం పోయిందన్న విషయం తాను గ్రహించగలనని ఆయన చెప్పారు. అయితే, ఆ సమయంలో అదే కరెక్ట్ అనుకుని ముందుకెళ్లానన్నారు. గత వారం శరద్ పవార్ ను ఫడ్నవీస్ కలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో కేవలం పరామర్శించడానికే వెళ్లానని ట్విట్టర్ లో స్పష్టతనిచ్చారు.

More Telugu News